తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ఇవాళ నాలుగు జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయా జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. ఈరోజు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు… కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
ఇక శనివారం రోజున… ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశముందని అప్రమత్తం చేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని.. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని ఐఎండీ హెచ్చరించింది.