హైదరాబాద్ నగరంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగరవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ.. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది.
చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేస్తూ.. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని చెప్పారు. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వివరించారు.
ఐదు జోన్ల పరిధిలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని తెలిపింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుంది.