మోత్కుపల్లి నర్సింహులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. టీడీపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇలా పార్టీలు మారుతూ పోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి నర్సింహులు.
ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తనను చంపేసినట్టే అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేవారు. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడం పై మాదిగలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. దీనిపై మోత్కుపల్లి స్పందిస్తూ.. “నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా.. నాకు ఏ పదవి అక్కరలేదు.. వర్గీకరణపై మొదట స్పందించింది సీఎం రేవంత్‌రెడ్డే.. ఆయనకు థాంక్స్ చెబుతూ తీర్మానం చేద్దాం.. ఉద్యోగాలలో వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుదాం” అని పేర్కొన్నారు.