సార్వత్రిక ఎన్నికల తరువాత మరో ప్రత్యక్ష ఎన్నికకు సిద్ధమవుతున్నాయి వైసీపీ,తెలుగుదేశం పార్టీలు. విశాఖ వేదికగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో ఇరుపార్టీల బలాబలాలు ఏంటో తెలిసిపోనున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 164 స్థానాలతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి టీడీపీ, వైసీపీ పార్టీలు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలోకి ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది. ఓట్ల పరంగా ఆ పార్టీ బలంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణను ప్రకటించి సంచలనం రేపారు జగన్మోహన్‌రెడ్డి.
జగన్ వ్యూహాత్మకంగానే సీనియర్ నేత బొత్ససత్యనారాయణ ను అభ్యర్థిగా ప్రకటించారు. స్థానిక సంస్థలకు సంబంధించి విశాఖ జిల్లాలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కూటమి కంటే దాదాపు 600 ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే స్థానిక నాయకులను నిలబెడితే.. అధికార కూటమి అభ్యర్థిని ఢీకొట్టగలరా? అనే అనుమానం ఉండేది. అందుకే బలవంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణ ను బరిలోకి దింపారు.
రెండు రకాల వ్యూహాలతో బొత్సను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి చేరికలు ఆపడంతో పాటు ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకొని టిడిపి కూటమిని దెబ్బతీయడం వంటి కారణాలతో బొత్సను ఎంపికచేశారు. బొత్స ఎంపిక తరువాత జగన్ తో పాటు వైసీపీ శ్రేణుల్లో విజయంపై ధీమా కనిపిస్తోంది. బొత్స బరిలో నిలిచారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారనే నిర్ణయానికి వచ్చేశారు. టిడిపి అభ్యర్ధి ఎవరైనా సరే ముచ్చెమటలు పట్టడం ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగానే వైసీపీ అభ్యర్ధిని ప్రకటించేశారు జగన్. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. కూటమిలో టిడిపికే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో టిడిపికి ప్రాతినిధ్యం ఎక్కువ. అందుకే ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో.. విశాఖ ఉత్తరం, దక్షిణం, అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి తదితర అసెంబ్లీ స్థానాలను వదులుకుంది టిడిపి. అందుకే ఆ పార్టీ నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి అభ్యర్ధిగా గండి బాబ్జి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశించారు బాబ్జీ. కానీ అనూహ్యంగా ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అందుకే ఇప్పుడు గండి బాబ్జి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. సీనియర్ నేత దాడి వీరభద్రరావు, గోవింద్, సీతం రాజు సుధాకర్, మైనారిటీ నేత నజీర్ సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో అభ్యర్ధిని నిలబెట్టాలా వద్దా అని టీడీపీ మదనపడుతోంది. అభ్యర్ధిని నిలబెట్టి ఓడిపోవడం కంటే పోటీకి దూరంగా ఉండటమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ నేతలు మాత్రం ఈ సీటు కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఏంటనేది త్వరలోనే తేలిపోనుంది.