తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 09న సచివాలయంలో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మాణం చేసినట్టు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. తాజాగా అస్తిత్వంపై దాడి-చర్య అంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మన సంస్కృతి పై దాడి జరుగుతుంటే.. ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లి పై ప్రేమ లేదు కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని ఆరోపించారు.
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే.. తెలంగాణ సమాజాన్ని చూసినట్టుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుందని.. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందనే సందేశం ఇచ్చేది బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.