తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్కులో నిర్వహించిన బీసీ మహాసభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని.. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహం పై తాను చెప్పిన విషయాలలో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేసారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే.. అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని తెలిపారు.
రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే.. మరో కమిషన్ రిపోర్టు ఇస్తున్నదని.. రేపు కోర్టుల్లో ఇది నిలుస్తుందా అన్నారు కవిత.