తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్నారు తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కూతురుపై దాడులు చేస్తున్న బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో ఉందన్నారు తమ్మినేని. ప్రధాన మంత్రి మోడీ,అమిత్ షా ఎన్ని పర్యటనలు చేసినా ఆశించిన స్థాయిలో బీజేపీలో చేరికలు లేవన్నారు.
అసంతృప్త నాయకులు కాంగ్రెస్, ఇతర పార్టీలో చేరుతున్నారన్నారు. మునుగొడు ఎన్నికల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా సీపీఎం, సీపీఐ కలిసి ఉంటాయని స్పష్టం చేశారు. సిపిఐ, సీపీఎం తో కలిసి బిఆర్ఎస్ పని చేస్తుందని కెసిఆర్ కూడా చెప్పారని తెలిపారు. బిఆర్ఎస్ తో ముందుకు వెళ్తామని… సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీసీలపై ప్రధాన మంత్రికి ప్రేమ ఉంటే కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు తమ్మినేని వీరభద్రం. చిచ్చు లేపటం మాని బీజేపీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.