తెలంగాణలో పదేళ్లలో అభివృద్ధిని ప్రపంచం చూస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు సీఎం కేసీఆర్. రాష్ట్ర విభజనతో తెలంగాణ వెనుక బడుతుందని గత పాలకులు దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. కానీ విభజనతో కారు చీకట్లు తప్పవని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు విషం చిమ్మారని తెలిపారు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అందరికీ తెలిసినవే అన్నారు.
ప్రయాణంలో సింగిల్ రోడ్డు వస్తే ఏపీ.. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ అని ప్రజలు చెబుతారని తెలిపారు కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి నిలబడే వారిని అసెంబ్లీలో అడుగుపెట్టనీయమని కొందరూ అహంకారంగా మాట్లాడుతున్నారని.. పొంగులేటి పై సీఎం కేసీఆర్ పరోక్షంగా మండిపడ్డారు. సీఎం గా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా నేను కూడా అంత అహంకారంగా మాట్లాడను. పైసలు జేబుల్లోకి రాగానే ఇంత మదమా..? ఎన్ని రోజులు ఈ డబ్బు రాజకీయాలు చేస్తారు..? 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. 10 ఏళ్లు బీఆర్ఎస్ చరిత్ర ప్రజల ముందే ఉందన్నారు. రూ.70ల గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.