రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. ప్రభుత్వం చేతకాని తనం వల్ల ఆదాయం పడిపోయిందని దుయ్యబట్టారు. అంచనాలను ఎందుకు అందుకోలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తొండ ముదిరితే ఊసరవెల్లి, ఊసరవెల్లి ముదిరితే రేవంత్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన 2లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు.
అలాగే నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500, తులంబంగారం, మొత్తానికి ఆరు గ్యారెంటీల హామీలన్ని గోవిందా అయ్యాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు 6 వేల కోట్లు ఎవడి అబ్బసొత్తు అని పంచి పెడతాం అంటున్నారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదకరం అని గతంలోనే చెప్పినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన 20% కమిషన్ పాలన.. దేశానికే సిగ్గు చేటైన పాలన అన్నారు. కాంగ్రెస్ నాయకులకు ట్రిలియన్ డాలర్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ చేస్తారంట. ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ కాదు.. ట్రిలియన్ డాలర్ల అప్పులు చేస్తారని పేర్కొన్నారు కేటీఆర్.