సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. గురువారం కొల్లూరు లో ఆయన మాట్లాడుతూ.. పాలమూరుపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుపై మనం గెలిచామన్నారు. కొంతమంది డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని.. ఆ దొంగ డిక్లరేషన్లను నమ్మితే మోసపోతామని అన్నారు. వారు ఎన్ని డిక్లరేషన్ లు చేసినా మూడో సారి సీఎం కేసీఆర్ అని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ కిట్ల మీద కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బిజెపి వాళ్ళు తిట్లు తిడుతున్నారని మండిపడ్డారు. వాళ్లేంత తిట్టినా ఆశీర్వాదాలు అనుకోని కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఖైరతాబాద్ చౌరస్తా ముందు నీటి కోసం రోజు ధర్నాలు జరిగేవని గుర్తుచేశారు. సినిమా హీరో రజనీకాంత్ హైదరాబాద్ ని చూసి నేను హైదరాబాద్ లో ఉన్నానా.. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నానా అన్నారని.. కెసిఆర్ పనితీరును రజినీకాంత్ మెచ్చుకున్నారని తెలిపారు.
కానీ ఇక్కడ ఉన్న బీజేపీ, కాంగ్రెస్ గజినీలకు అర్థం కావడం లేదని విమర్శించారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో దేశంలో నంబర్ వన్ అయ్యిందని ప్రపంచం అంతా మెచ్చుకుంటుందన్నారు. మా హైకమాండ్ ప్రజలని.. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ల తిట్లు, శాపనర్దాలు దివేనలుగా భావిస్తామన్నారు.