రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం వేళ భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇవాళ, రేపు వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ రెండు రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.