గ్రేటర్ హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు నిన్న రాత్రి నుంచే ఘనంగా ప్రారంభం అయ్యాయి. 9 రోజుల పాటు విశేషంగా పూజలు అందుకున్న గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకూ 40 వేల విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయి. మంగళవారం ఒక్క రోజే లక్ష గణపతులు నిమజ్జనం కానున్నాయి. వివిధ చెరువులు, కుంటలు, కాలువలు, సరస్సులలో స్థానిక వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి భారీ గణపయ్యలు తెల్లవారుజాము నుంచే హుస్సేన్ సాగర్‌కు తరలుతున్నాయి.నగర వాసులు బైబై గణేశ్ అంటూ ఘనంగా బొజ్జ గణపయ్యలకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ ఏడాది తమకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ వచ్చే ఏడాది కలుద్దామంటూ గణనాధులకు వీడ్కోలు పలుకుతున్నారు. ఇక చిన్నారులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.సాగర్‌లో ఇప్పటికే 30వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.ఇక ఖైరతాబాద్ మహాగణపతి మరికాసేపట్లో ట్యాంక్ బండ్ వైపు శోభాయాత్రగా కదలనున్నారు.ఇందుకోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు.