ఖైరతాబాద్ మహా గణేషుడు తాజాగా నిమజ్జనం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ గణేషుడి శోభ యాత్ర ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమైంది. తెల్లవారుజామున ప్రారంభమైన యాత్ర ఇవాళ మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్రలో జనసంద్రం కనిపించింది. ఈ జనసంద్రాన్ని అదునుగా భావించి దొంగలు హల్ చల్ చేశారు. 70 అడుగుల గణనాథున్ని డప్పుల మోతలు, డీజే గాన భజనలు మధ్య ట్యాంక్ బండ్ వద్దకు తీసుకెళ్తుండగా కేటుగాళ్లు చేతి వాటం చూపించారు.
భక్తుడు బాబు వినోద్ అనే వ్యక్తి తన మెడలో మూడు తులాల చైన్ ధరించి వేడుకలు చూసేందుకు వచ్చాడు. ఇది గమనించిన ఓ దొంగ రద్దీలో దూరి ఆయన చైన్ ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన వినోద్ అక్కడి పోలీసులకు చెప్పడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన సల్మాన్ గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతని వద్ద చైన్ ను స్వాధీనం చేసుకొని బాబు వినోద్ కు అందజేశారు పోలీసులు.