జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిపై సర్వే జరుగుతోందని వెల్లడించారు. అభ్యర్థులు ఎవరున్నా అందరూ కలిసి పని చేస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారే అభ్యర్థులుగా ఉంటారని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వమని తెలిపారు. స్థానిక అభ్యర్థులకే టికెట్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశామని తెలిపారు.