తెలుగు వారి తెలుగు పండుగ కొత్త సంవత్సరం వచ్చేసింది. తెలుగు వాకిళ్లల్లో ఉగాది పండుగ సంబురం మొదలైంది. క్రోధి నామ సంవత్సరం సందడి నెలకొంది. ఏటా చైత్రమాసంలో శుక్లపక్షంలోసూర్యోదయ వేళకు పాడ్యమితిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఆ పండుగను తెలుగువారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.
ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొదటగా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది స్ఫూర్తిని కొనసాగిద్దామని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు తెలుగు పండుగ ఉగాది విషెస్ చెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని అన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరుకున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నుంచి కాలచక్రం తిరిగి మొదలవుతుందని, రైతన్నలు ఉగాది నుంచే సాగు పనులు ప్రారంభిస్తారని చెప్పారు. క్రోధ నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.