తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళలో ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రతీ రోజు సీఎం కేసీఆర్ రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్నాయి. తాజాగా కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసి మాట్లాడితే.. కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ నేత ఈటల రాజేందర్ అధికార బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి రావద్దని ప్రజలు ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పై విశ్వాసం లేదని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తప్పుకోవడం పై మండపడ్డారు. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.