ప్రతి ఏడాది భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. వరద వచ్చిన ప్రతిసారి గోదావరి పరివాహక ప్రజలు ముంపుతో ఇబ్బందులకు గురవుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా నీటిపారుదల శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే గోదావరి వరద ముంపు నివారణకు సమగ్ర అధ్యయనం చేసి నెలరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ నిర్ణయించింది.
ముంపు ప్రభావిత భద్రాచలం ఆలయం, పర్ణశాల, మణుగూరు భారజల కర్మాగారం రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. గోదావరికి అనుబంధంగా ఉన్న 37 ప్రవాహాల్లోని 10 వేల క్యుసెక్కులను మించి ప్రవాహం ఉన్న ఏడు వాగులపై దృష్టి సారించాలని.. వరదను నిలువరించేందుకు అవసరమైన చోట కరకట్టలు నిర్మించాలని.. అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించి, నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించాలని అధికారులకు రజత్ కుమార్ సూచించారు.