గత కేసీఆర్ సర్కార్ హయాలంో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి కమిషన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్కు కూడా ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో జస్టిస్ నరసింహారెడ్డి ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై స్పందించారు. దానిపై తాజాగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
జస్టిస్ నరసింహరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఈనెల 11న జరిగిన మీడియా సమావేశంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని.. జస్టిస్ నరసింహరెడ్డి తీరుతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. జస్టిస్ నరసింహరెడ్డి నిజం వైపు ఉంటారని మేము ఆశించామని చెప్పారు. న్యాయ విచారణ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న జగదీశ్ రెడ్డి.. కోర్టులు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వాలకు విచారణ చేసే అధికారం ఉండదని స్పష్టం చేశారు.
ఈఆర్‌సీ ఇచ్చిన తీర్పుపై విచారణ చేయకూడదనే జస్టిస్ నరసింహరెడ్డి చెప్పాలి. జస్టిస్ నరసింహరెడ్డి.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 15 వరకు గడువు ఇచ్చి 11న మీడియా సమావేశం పెట్టారు. జస్టిస్ నరసింహరెడ్డి నిజాయితీగా ఉంటే కమిషన్ బాధ్యత నుంచి వైదొలగాలి. అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.