నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పరిపాలనకు అందరు సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కోరారు. పరిపాలన పరిస్థితులు ఇచ్చిన హామీలు, ప్రజా అభిమానం సొంతం చేసుకునేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాలన బాధ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఐకమత్యంగా కలిసి పని చేయాలని సూచించారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కాదని.. కానీ పార్టీకి సీనియర్ నాయకుడిగా ప్రజలు ఇచ్చిన ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా జానారెడ్డిని కలిశారు. రేవంత్ కలిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ అలా కావడం బాధాకరం. నేను కూడా పరామర్శకు వెళ్లాను. ఆయనకు చికిత్స అందిస్తున్నపుడు బయట నుండే చూశాను. కేటీఆర్, హరీశ్ రావులను పరామర్శించాను. సాధ్యమైనంత త్వరగా ఆయన కోలుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి. నల్గొండ పార్లమెంట్‌కు పోటీ చేస్తా అని గతంలో అన్నాను. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్‌కు పోటీ చేస్తాను. 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను అన్ని రకాల మంత్రి పదవులు చేశాను. జైవీర్‌కి ఏ పదవి కావాలని నేను అడగలేదు. తను ఇంకా జూనియర్. అప్పుడే పదవులు అడగడం సబబు కాదు. అని జానారెడ్డి అన్నారు.