ఈనెల 24న కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ ‘వందేభారత్‌’ ప్రారంభం

-

ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా.. వీలైనంత త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో కేంద్ర సర్కార్ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ రైళ్లు రాకపోకలను సాగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌, బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. ఈనెల 24వ తేదీన కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌) మధ్య రాకపోకలు సాగించే రైలు ప్రారంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

కాచిగూడ రైల్వేస్టేషన్‌ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. సోమవారం నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30కు బయలుదేరి.. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరిగి 2.45గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. దీంతో సహా ఈ నెల 24న ప్రధాని మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో విజయవాడ-చెన్నై వందేభారత్‌ కూడా ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news