ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం లో కవిత 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు ఆమె మెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించినా చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ గవాయ్, విశ్వనాథ్ లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
ఇక 10 లక్షల చొప్పున రెండు కేసుల్లో 20 లక్షల వ్యక్తిగత పూచికత్తుతో పాటు ఆమె పాస్పోర్టు స్వాధీనం చేయాలనే షరతులతో కవితకు సుప్రీమ్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైకి రావడం పై బుధవారం మీడియాతో చిట్ చాట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బిజెపికి బదిలీ చేసిందని.. ఆ కారణంగానే ఎమ్మెల్సీ కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. ఇదే మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియాకు బెయిల్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
నెలలు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఎందుకు బెయిల్ రావడం లేదని అన్నారు. 16 నెలలు జైల్లోనే ఉన్న సిసోడియాకు బెయిల్ ఎందుకు రావడం లేదన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, మిగతా వారికి మరో న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.