కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్‌కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ కంపెనీ, ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం సరికాదన్నారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియాలపై ఉక్కుపాదం మోపాలని.. స్థానిక అవసరాలకు ఇసుక వాడుకునేందుకే అనుమతించాలన్నారు. సివిల్ సప్లై సీఎమ్మార్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.
మిల్లర్లు ధాన్యం అమ్ముకుని ఇప్పుడు డబ్బులు చెల్లిస్తామంటున్నారని.. వారిపై ఛీటింగ్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల వద్ద స్టాక్ లేనట్టయితే 6ఏ కేసులు పెట్టినట్టుగానే మిల్లర్లపై చట్టాలను అమలు చేయాలని అన్నారు. ఏపీలో కలిపిన మండలాల విషయంలో కేంద్రం మెడలు ఎందుకు వంచలేకపోయావు..? అంటూ జీవన్ రెడ్డి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని విషయాల్లో మెడలు వంచి తెచ్చుకున్నామని చెప్పుకున్న మీరు ఏడు మండలాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించారు. లోక్ సభలో అన్ని బిల్లులు పాస్ అయ్యేందుకు కేంద్రానికి సహకరించిన బీఆర్ఎస్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను ఉరి తీయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.