కేసీఆర్ తాలిబన్లకు అధ్యక్షుడు – వైఎస్ షర్మిల

-

బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అక్రమాలను ప్రశ్నించినందుకు అడ్వకేట్ యుగంధర్ పై దాడి చేయడం BRS నేతల గుండాయిజానికి నిదర్శనం అన్నారు. దళితబంధు నిధులను కాజేసి, ఇసుక మాఫియాకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గురించి ఆధారాలతో సహా బయటపెట్టడం అడ్వకేట్ చేసిన పాపమా? అని ప్రశ్నించారు.

అవినీతిపై కొట్లాడుతుంటే KCR ఇచ్చే బహుమతి చావ కొట్టడమా? ముమ్మాటికీ కేసీఆర్ పాలన తాలిబన్ల పాలన అని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తాలిబన్లకు అధ్యక్షుడని.. యుగంధర్ ను రక్తమోడేలా కొట్టినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. దళిత బిడ్డపై దాడి జరిగితే చర్యలు తీసుకోని కేసీఆర్ ఒక దళిత ద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ దళితులను పురుగుల్లా, ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాడన్నారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్నీ మోసాలేనని.. దళితబంధు పథకం ఎమ్మెల్యేల బంధులా మారిందన్నారు.

ఎమ్మెల్యేలకు మాత్రమే మేలు చేస్తున్న పథకమిదని.. దీనికి పోలీసులను సైతం సైన్యంలా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు తిరుమలగిరిలో దళితబంధుపై జరుగుతున్న అక్రమాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయాలని భావిస్తే.. కేసీఆర్ పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో ప్రజలపక్షాన పోరాడడం నేరమా? పోలీసులను తొత్తులా పనివాళ్లలా వాడుకోవడానికి కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news