వైద్య, ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా నిలవాలని రాష్ట్ర సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య రంగంలో అనేక పథకాలు, సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇప్పటికే పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఇవాళ 466 అంబులెన్స్‌లను సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 108 అంబులెన్స్‌లు 204 ఉండగా.. అమ్మఒడి వాహనాలు 228, పార్థివ దేహాలను తరలించే వాహనాలు 34 ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్ శాంతికుమారి, ఇతర వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి సీఎం ఈ వాహనాలు ప్రారంభించడంతో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని స్పష్టం చేశారు. కుటుంబ పెద్దగా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని తెలిపారు.