తెలంగాణ సర్కార్ మహిళల సంరక్షణకు.. ఆరోగ్యానికి.. అభివృద్ధికి అన్నిరకాలుగా కృషి చేస్తోంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి సర్కార్ పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే గర్భిణులకు పౌష్టికాహారం అందించే ప్రత్యేక పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ అమలు చేయనుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లను పంపిణీ చేయనుంది. గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంతో పాటు మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు కానుంది.
సుమారు ఏడు లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రూ.274 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. ప్రధానంగా మాతృ మరణాల రేటు తగ్గింపులో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు కీలకంగా మారుతాయని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో ఇప్పటికే గుర్తించిన గర్భిణులకు పౌష్టికాహార కిట్‌లను అందజేయనున్నారు. మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్భిణులకు రెండు సార్లు రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేశారు.