తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హామీల అమలు, ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలు… వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తిచూపాలని భావిస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో లోపాలు పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కార్‌ను ఇరుకున పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఇవాళ జరగనున్న పార్టీ శాసనసభా పక్షంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే అనారోగ్యం కారణంగా ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అధినేత హాజరవుతారని బీఆర్ఎస్ నేతల సమాచారం. హామీల అమలు, వైఫల్యంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి, సంబంధిత అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. నిధులు ఇవ్వకపోవడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పెట్టుబడులు తరలడం, నగర ప్రతిష్ట దిగజారేలా సర్కార్ చర్యలు… తదితరాలను ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా పోరాడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.