తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు సాగిస్తోంది. సుడిగాలి పర్యటనలు.. వాడివేడి ప్రసంగాలు.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉంది. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలతో మంత్రులు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చునన్న ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా వేగం పెంచింది.
ఓవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సుడిగాడి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ వాడివేడి ప్రసంగాలతో ఓవైపు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇద్దరు మంత్రులు ఇప్పటి వరకు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వాడివేడి ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ను మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు.
మరోవైపు కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రచారం ప్రారంభించనున్నారు. త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత.. ఈనెల 16వ తేదీన వరంగల్‌లో జరగనున్న విజయగర్జన సభలో మేనిఫెస్ట్ ప్రకటించనున్నారు. రైతులకు ఫించను, ఉచితంగా ఎరువుల పంపిణీ, మహిళలు, యువత, బీసీలు, మైనారిటీలకు పలు ఎన్నికల హామీలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.