కొత్త పార్టీ పెట్టే యోచ‌న‌లో టీఆర్ఎస్ నేత‌లు ! నిజమేనా?

– ఆ ప‌ద‌విని కేసీఆర్ ఎవ‌రికీ ఇవ్వ‌డు !
– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్

త్వరలో సీఎం కేసీఆర్ త‌న‌ పగ్గాలను కేటీఆర్ కు అందజేయబోతున్నాడ‌నే ప్రచారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఈ విష‌యంపై రాజ‌కీయంగా పెద్ద చ‌ర్చ‌కు దారి తీస్తోంది. అయితే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో జరగనున్న‌ పరిణామాల గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప‌లు కీల‌క వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆలోచన కేసీఆర్ కు లేదని బండి సంజ‌య్ పేర్కొన్నాడు. రానున్న 15 రోజుల్లో కేటీఆర్ సీఎం అవుతాడ‌నే ప్ర‌చారం ఫేక్ అని తెలిపాడు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్

అలాగే, టీఆర్ఎస్ లోని కొంద‌రు నేత‌లు మంత్రి పదవి ఇవ్వ‌క‌పోతే కొత్త పార్టీ పెడతామని ఇప్పటికే ముగ్గురు, నలుగులు ఎమ్మెల్యేలు అంటున్నారనీ, ఈ మాటలను వారితో అనిపించింది కూడా కేసీఆరే అని బండి సంజ‌య్ తెలిపాడు. కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని.. ఆ విష‌యం కేసీఆర్ కు తెలుస‌ని పేర్కొన్నాడు. అందువల్లే సీఎం కావాలనే ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టాలని కేటీఆర్ కు సీఎం సూచిస్తాడ‌ని తెలిపాడు. అందుకే కొడుకును సీఎంను చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ వాయిదా వేస్తాడ‌ని పేర్కొన్నాడు.

గతంలో ప‌లువురు నేత‌ల‌తో ఇలాంటి వ్యాఖ్యలు చేయించాడ‌ననే విష‌యాన్ని బండి సంజ‌య్ గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఈ మాట‌ల‌ను చెప్పిస్తున్నాడ‌ని పేర్కొన్నాడు. కేటీఆర్ ను ఇప్ప‌ట్లో సీఎం చేయబోరని తెలిపాడు. సీఎం సీటులో కేసీఆరే ఉంటాడ‌ని బండి సంజ‌య్ తెలిపాడు.