– మంత్రులు, అన్ని జిల్లాల లెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ
-కరోనా వ్యాక్సిన్ పంపిణీ, రెవెన్యూ, విద్యాసంబంధిత అంశాలపై సమీక్ష
హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ రోజు (సోమవారం) సీఎం కేసీఆర్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, పలు శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవెన్యూ, విద్యాసంబంధిత అంశాలతో పాటు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వ్యాక్సిన్ పంపిణీపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంది ముగిసిన అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
విద్యా, రెవెన్యూ, కరోనా అంశాలతో పాటు రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం మొదలైన కార్యక్రమాలపై కూడా ఆయన మంత్రులతో అధికారులతో చర్చించనున్నారు. ఈ సమీక్షకు సంబంధించి మంత్రులకు, అధికారులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే అన్ని విషయాలకు సంబంధించి పూర్తి నివేదికలు తీసుకురావాలని మంత్రులకు, అధికారులకు సూచించినట్లు సమాచారం.
ప్రగతి భవన్ లో జరిగే ఈ చర్చలో సీఎం ఆయా కార్యక్రమాల అమలును అడిగి తెలుసుకోనున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ వంటి పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రానున్న బడ్జెట్ సమావేశాలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే వాటి తాలుక తేదిలను ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, విద్య సంస్థల తిరిగి ప్రారంభానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.