తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్రాజ్లో చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిబ్బంది పూర్తి చేశారు. నేటి నుంచి ఈ నెల 6 వరకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం క్రతువు కొనసాగనుంది. మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్, శోభ దంపతులు ప్రధాన కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి రాజకీయ ప్రతికూల వాతావరణం, కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఈ యాగానికి ఇటీవలే సొంత పార్టీ నేతలపై మాటల తూటాలు పేలుస్తున్న ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.