బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పలు కీలక విషయాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ని కుట్రధారుడిగా పేర్కొంటూ అతనిపై 420, 120బి, సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సిఆర్పిసి 154, 157 సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.
ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు బండి సంజయ్ కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. ప్రశాంత్ తో కొంతకాలంగా బండి సంజయ్ కాంటాక్ట్ లో ఉన్నారని, వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ కంటే ముందు రోజు ప్రశాంత్ తో బండి సంజయ్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. పేపర్ ని బండి సంజయ్ కి పంపాక కూడా ప్రశాంత్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. బండి సంజయ్ తో ప్రశాంత్ వందకు పైగా కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.