వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది.. ముందుగా ముంబయి ఆ తర్వాత హైదరాబాద్. ఇక భాగ్యనగరంలో గణేశ్ చతుర్థి పేరు వినగానే మదిలో మెదిలే మొదటి ఆలోచన ఖైరతాబాద్ గణేశుడు. ఏటికేడు ఎత్తు పెరుగుతూ.. ఆకాశాన్ని తాకేలా మహాగణపతి కొలువుదీరి ప్రజలు కొంగుబంగారంగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఖైరతాబాద్ మహాగణపతి కేవలం హైదరాబాద్, తెలంగాణలోనే కాదు భారత్ దేశంలోనూ చాలా ప్రసిద్ధి గాంచింది. అందుకే వినాయక చవితి సంబురాలు షురూ కాగానే.. దేశనలుమూలల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ ఏడాది కూడా భక్తుల కొంగు బంగారంగా కొలువు దీరేందుకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటీపడతారు. ఈ ఏడాది ‘శ్రీ దశమహా విద్యా గణపతి’ రూపంలో ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వినాయక చవితికి 63 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్టు ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి కుడి వైపు పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి ఉంటారని కమిటీ పేర్కొంది.