గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కనువిందు చేసేందుకు రెడీ అవుతున్నాడు. వినాయక చవితి దగ్గరికి వస్తుండటంతో గణనాథుడి తయారీలో ఉత్సవ సమితి వేగం పెంచింది. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తోంది. 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో.. 10 చేతులు, 7 తలల పడగల కాలనాగుపై నిలబడి భక్తులకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నారు.
37ఏళ్లుగా ఖైరతాబాద్ గణపతిని చూడమచ్చటగా తయారుచేస్తున్న.. ప్రధానశిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో సుమారు 150 మంది కళాకారులు, నిపుణులు నిరంతరం పనిచేస్తున్నారు. సుమారు కోటి రూపాయల విలువైన సామాగ్రితో ఖైరతాబాద్ మహాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం రంగులద్దే పని జోరుగా జరుగుతోంది. ఈనెల 16వ తేదీ వరకు పనులు పూర్తిచేసి 18 నుంచి ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులకు దర్శనం ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 18న గణపతి పూజ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. ఈనెల 18వ తేదీ నుంచి భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు రావొచ్చని ఉత్సవ కమిటీ తెలిపింది.