కేసీఆర్ కుటుంబం అక్రమ సంపాదనతో ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్థిక మూలాలను కేసీఆర్ ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి తప్పితే.. ప్రగతి భవన్ గోడలు దాటవని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. దీపావళి తర్వాత…బీజేపీ ప్రచారంలో మరింత జోరు సాగిస్తుందని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. గ్యారెంటీల పేరిట కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ ముంచిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకున్న రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని విమర్శించారు. కేసీఅర్ మరొసారి అధికారంలోకి వచ్చినా.. హస్తం పార్టీ పగ్గాలు చేపట్టినా తెలంగాణ అంధకారం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ తనిఖీలతో తనకేం సంబంధమని వివరణ ఇచ్చారు.
మరోవైపు మునుగోడు, పాలకుర్తిలో అనురాగ్ ఠాకూర్.. కొల్లాపూర్, నాగర్ కర్నూల్‌లో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రచారం చేస్తారని తెలిపారు. వరంగల్ తూర్పు, పశ్చిమ అసెంబ్లీ స్థానాల పరిధిలో అశ్విని కుమార్ చౌబే ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని పునరుద్ఘాటించారు.