జీతం రాలేదని హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఆయన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే తాజాగా రవీందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయనకు, ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రవీందర్ ఆత్మాహత్యాయత్నం చేయడం దురదృష్టకరం అని అన్నారు.
హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడి జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. హోంగార్డులు కొన్నిసార్లు 16 గంటలు పనిచేస్తున్నారని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని.. వారికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
“హోంగార్డులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ శాసనసభలో హామీ ఇచ్చారు. హోంగార్డు కుటుంబసభ్యులు జీతాలు లేక రోడ్డున పడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో హోంగార్డులు పనిచేస్తున్నారు. పోలీసు వ్యవస్థలో హోంగార్డులకు అవమానం జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డులకు అండగా ఉంటాం.” అని కిషన్ రెడ్డి అన్నారు.