తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకపడ్డారు. బ్యారేజీ కుంగిపోవడం విషయం తెలుసుకుని పరిశీలించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించేందుకు వెళ్తారని, వేలకోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టుపై మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని.. అవి నిజమయ్యాయని, వాస్తవం అని తేటతెల్లమైందని అన్నారు.
సూపర్ ఇంజనీర్లు, డ్రీమ్ ప్రాజెక్టు అంటూ సీఎం కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారనీ, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ఇంజినీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఎద్దేవా చేశారు. నిపుణులు, ఇంజనీర్ల మాటల్ని పట్టించుకోకుండా నిర్మించిన ప్రాజెక్టు సమస్యలమయంగా మారిందని అన్నారు.తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నష్టం కలిగించిందన్నారు. గతంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో పంపుహౌజ్ మనిగిపోయి.. భారీ నష్టం వాటిల్లిందన్నారు. యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు అని గొప్పలు చెప్పారు. కానీ, నిర్మాణంలో ప్రభుత్వం బొక్కబోర్లా పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపిందని విమర్శించారు. ఏటా 400 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారనీ, 2019 జూన్ లో ప్రాజెక్టు ప్రారంభిస్తే..ఈ నాలుగేళ్లలో కేవలం 100కి పైగా టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోశారని, ఇది కేసీఆర్ నిర్మించిన విచిత్రమైన ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు.