కర్ణాటక నుంచి నీటిపారుదల శాఖ అధికారులు నేడు తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని తాగు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ఎగువ కృష్ణా ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకను పలుమార్లు కోరిన విషయం తెలిసిందే.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నీటిపారుదల ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా పలుమార్లు ఆ రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపారు. దీనిపై సానుకూలంగా స్పందించి తెలంగాణ విజ్ఞప్తిని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు నీటిని విడుదల చేయనున్నట్లు వర్తమానం పంపగా మరోమారు సీఈ బృందం కర్ణాటకకు వెళ్లింది. గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని జూరాల జలాశయానికి నీటి ప్రవాహం చేరుకోనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.