ఈ నెల 21 వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య కమిటీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. 2023-24 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల కోసం ఈ కమిటీ భేటీ కానుంది. ఆగస్టు నెలాఖరు వరకు తమకు తాగునీరు, సాగునీటి కోసం 16 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు బోర్డుకు ప్రతిపాదనలు కూడా పంపారు.
ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభిప్రాయాన్ని కూడా కృష్ణా బోర్డు కోరింది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగించుకున్న జలాలను ఈ ఏడాదికి జమ చేయాలని… తదుపరి త్రిసభ్య కమిటీ సమావేశంలో వాటిని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్ కు లేఖ రాశారు. సమర్థంగా నీటిని వాడుకొని తదుపరి అవసరాల కోసం తెలంగాణ తన వాటాలోని నీటిని ఉమ్మడి జలాశయాల్లో నిల్వ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలోనే బోర్డుకు కూడా ఈఎన్సీ మురళీధర్ నివేదించినట్లు తెలిపారు.