రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ఐటీ రంగం ఫేటే మారిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే లండన్‌లో పర్యటించి పలు పెట్టుబడులు తీసుకువచ్చిన మంత్రి.. ఇప్పుడు అమెరికా వెళ్లనున్నారు.
మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలోని ప్రముఖు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను వివరించనున్నారు.
తెలంగాణలో పెట్టుబడులపై కొన్ని కీలక ఒప్పందాలు కూడా జరగనున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులు కూడా కేటీఆర్ వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్ రాష్ట్రానికి కీలక పెట్టుబడులు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.