పర్యావరణహితం కోసం.. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ.. వాయు కాలుష్యాన్ని నివారించే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ఈ-గరుడ బస్సులుగా టీఎస్ఆర్టీసీ వీటికి నామకరణం చేసింది. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా నడపాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా పది బస్సులను ఇవాళ ప్రారంభించనున్నారు. మియాపూర్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని పుష్పక్ పాయింట్ వద్ద రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సాయంత్రం 5 గంటలకు జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చేలా సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇవి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని చెబుతోంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ-గరుడ ఛార్జి రూ.780గా నిర్ణయించారు. మార్గంలో సూర్యాపేటలో స్టాపేజీ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు.