దేశానికి కావాల్సింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని.. ప్రజలకు కావాల్సింది బీఆర్ఎస్ వంటి నాయకత్వం ఉన్న పార్టీ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీయేనని తేల్చి చెప్పారు. ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్‌ఎస్ సిద్ధాంతం కాదని స్పష్టం చేశారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే పాలన అందించాలన్నదే బీఆర్‌ఎస్ ఎజెండా అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, బీఆర్‌ఎస్ పాలనలో అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెప్పారు.
‘మీ దగ్గర మాకంటే మంచి కార్యాచరణ ఉంటే ప్రజలకు చూపండి’ అని కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చినట్టు దేశమంతా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మోదీ ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ నిలదీశారు.
“ఏబుల్ గవర్నమెంట్.. స్టేబుల్ లీడర్‌షిప్ తెలంగాణలోనే ఉంది. గతంలో బెంగాల్ ఏం ఆలోచిస్తదో భారతదేశం దాన్ని ఆచరిస్తుంది అనే నానుడి ఉండేది. నేడు తెలంగాణ ఏం చేస్తే రేపు దేశం దాన్ని అనుసరిస్తుంది అనేదాకా తెలంగాణ ఎదిగింది.” అని కేటీఆర్ తెలిపారు.