తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను.. కేంద్ర సర్కార్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేసీఆర్ హ్యాట్రీక్ సీఎం అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రచార వేగాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. 54 నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించి.. ప్రచారంలో మరింత జోష్ పెంచింది.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. బీఆర్ఎస్ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలాగా ముందుకు సాగాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
‘”గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలుచేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, ప్రతి గడపకూ వెళ్లి వివరించాలి. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమవ్వాలి. ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్క నాయకుడిపై ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతలను మీరు తీసుకోవాలి. పార్టీ శ్రేణులన్నింటినీ సమన్వయం చేసుకొని ప్రచార బాధ్యతలను నిర్వహించాలి’’ అని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇంఛార్జీలకు సూచించారు.