ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలుపు ఖాయమని.. అలాగే తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ విజయం కూడా ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా.. ప్రజలు గెలవాలని బీఆర్ఎస్ కోరుకుంటోందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను కాకుండా తెలంగాణను గెలవాలని కోరుకుంటోందని.. అంటే ప్రజలు ఓడిపోయినా పరవాలేదనేది ఆ పార్టీ వైఖరి అంటూ విమర్శించారు.
గత తొమ్మిదన్నరేళ్లలో కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా అవి అర్హులకు కచ్చితంగా అందేలా చూశామని వెల్లడించారు. కేసీఆర్ ప్రవేశపెట్టినన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలను నేడు దేశం అనుసరిస్తోందని పురనరుద్ఘాటించారు.
ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తమకు పోటీయే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతోంది.. స్కాంగ్రెస్ నేతలకు అసలు ప్రజలను ఓట్లు అడగడానికి మనసెలా వస్తోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని అన్నారు.