ప్రజలకు సంబంధంలేని అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తమకు తెలంగాణపై అహంకారం కాదు.. మమకారం ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలవగానే ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా కృషి చేస్తామని ప్రకటించారు. మధ్యతరగతి వారు ఇంటి రుణం తీసుకుంటే ప్రభుత్వమే వడ్డీ చెల్లించే యోచనలో ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్తిరాస్థి శిఖరాగ్ర సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
“కాంగ్రెస్ హయాంలో లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు చేసుకునే పరిస్థితి ఉండేదా? ధరణి రాకముందు 8 మంది అధికారులు భూయాజమాన్య హక్కులు మార్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం యజమాని బొటనవేలు పెడితే మాత్రమే యాజమాన్య హక్కులు మారతాయి. ధరణిలో చిన్నచిన్న లోపాలు ఉన్నాయి.. వాటిని సరిచేస్తాం. స్థిరమైన ప్రభుత్వం.. సరైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. బెంగళూరును తలదన్నే నగరంగా హైదరాబాద్ మారింది. వృథా నీటి పునర్వినియోగం కోసం నూతన విధానం తీసుకొస్తాం. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నాం.” అని మంత్రి కేటీఆర్ అన్నారు.