సెంటిమెంట్‌కు పోయి ఓట్లు వేస్తే ఆగం అవుతామని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేదనే బాధ ప్రజల్లో ఉందని తెలిపారు. 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు ఇస్తే.. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని చెప్పారు. బీజేపీ పోటీ చేసేదే 420 సీట్లలో అయితే.. 400 సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఒకసారి వాళ్లు మోసం చేశారు. రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుంది. పదేళ్లల్లో మల్కాజ్గిరికి బీజేపీ ఏం చేసింది? కేసీఆర్ 36 వంతెనలు కడితే ఉప్పల్, అంబర్పేటలో బీజేపీ రెండు వంతెనలు కూడా కట్టలేకపోయింది. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? మనం యాదగిరి గుట్ట కట్టుకోలేదా? దేవుడిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం లేదు. ప్రజలు సెంటిమెంట్లకు పడిపోకూడదు. మోదీ అక్షింతలు పంపిస్తే కేసీఆర్ దేశం మొత్తానికి బియ్యం పంపించారు.” అని కేటీఆర్ అన్నారు.