కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయలేకపోయిందని అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “తొలి సంతకమే రుణమాఫీపై పెడతామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబరు 9వ తేదీన రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారు. ఆరు నెలల క్రితం నాటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి గురించి ఆలోచించండి. ఆరు నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ గురించి యువత ఆలోచించాలి. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తాం అన్నారు.. కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థిక సాయం అన్నారు.. చేశారా..? మొదటిసారి మోసపోతే వారి తప్పు.. మరోసారి మోసపోతే మన తప్పు. మా పాలనలో కరెంట్ పరిస్థితి ఏమిటి.. ఇప్పటి పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు.