లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తో రైతులు తమ ఆవేదన చెప్పుకున్నారు. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు.
రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు. సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు. కానీ సురేష్ కు భూమి ఉంది. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. పోలీసులు, ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని కేటీఆర్ హెచ్చరించారు.