కాంగ్రెస్‌కు అదానీ, అంబానీ డబ్బు పంపుతుంటే ఈడీ ఏం చేస్తోంది?: కేటీఆర్‌

-

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ ఇటీవల సభలో మాట్లాడిన ప్రకారం.. కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని అన్నారని.. మరి వాళ్లు అలా అక్రమంగా నగదు పంపుతుంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలిసీ ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీశారు.

మరోవైపు మూడ్రోజుల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన గ్యారంటీలు కాకుండా.. ప్రజలంతా.. ఇన్వర్టర్లు, ఛార్జింగ్ లైట్లు, టార్చ్ లైట్లు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు అనే ఆరు గ్యారంటీలను సిద్ధంగా ఉంచుకోవాలంటూ సర్కారు పనితీరును ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news