పెంచిన పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా భూటాన్, పాకిస్తాన్, శ్రీలంకలో కంటే ఇండియాలోనే పెట్రో రేట్లు ఎక్కువ ఉన్నాయని, ఇదేనా కేంద్రం చెప్పిన అచ్చేదిన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వ పెట్రో సెస్ వలన రాష్ట్రాలకు జరుగుతున్న ఆర్థిక అన్యాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ రాసిన లేఖలో.. పెట్రో రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోడీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
వసూలైన సెస్సులతో మౌలిక సదుపాయాలను కల్పించకుండా తమ సొంత రాజకీయ అజెండా ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వకుండా దేశ సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే అక్రమంగా వసూలు చేస్తున్న సెస్సులతో సమకూరుతున్న ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తుందన్నారు