కేసీఆర్ కు బాబు & కో సున్నితమైన సూచనలు ఇవి!

-

రెండు రోజుల పాటు ఆన్ లైన్ వేదికగా జరిగిన టీడీపీ మహానాడు మొత్తం వైఎస్ జగన్ ను విమర్శించడం మీదే సాగిన క్రమంలో… తెలంగాణ ప్రస్థావన కూడా తీసుకొచ్చింది టీడీపీ! అయితే జగన్ విషయంలో చేసినన్ని విమర్శలు కేసీఆర్ విషయంలో చేసే సాహసం చేయని టీడీపీ నేతలు… సన్నాయి నొక్కులు నొక్కుతూ… కేసీఆర్ కు కొన్ని సుతిమెత్తనైన సూచనలు సలహాలూ చేశారు! ఈ విషయంలో తాను మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా.. మొత్తం బాధ్యతను తెలంగాణ టీడీపీ నేతలపైకే నెట్టారు బాబు!

“తెలంగాణలో వ్యవసాయ రంగం” అనే అంశంపై తీర్మానం సందర్భంగా మాట్లాడిన బాబు… ధాన్యం సేకరణలో గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని, మొక్కజొన్నను పెద్దేత్తున కొనాలని, రైతు బంధు సొమ్ము ఇంకా ఎవ్వరికైనా అందకపోతే వారందరినీ గుర్తించి అందించాలని సున్నితమైన సూచనలు చేశారు! ఈ మాటలు విన్న తరువాత “ఏపీలో జగన్ పై మాట్లాడిన బాబేనా.. కేసీఆర్ విషయంలో కూడా మాట్లాడింది..” అనే అనుమానం ఎవరికైనా వస్తే మాత్రం అది అనుమానం వచ్చినవారి తప్పు తప్ప… బాబుది మాత్రం కాదు! ఎందుకంటే… ఈ సున్నితమైన సూచనలు చేసింది బాబే!!

అనంతరం మైకందుకున్న తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం బాబు అంత సున్నితంగా కాకుండా… కాస్త స్వరం పెంచారు! కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గిట్టుబాటు ధర మరిచిపోయారని కొత్తకోట దయాకర్ రెడ్డి విమర్శించగా… ప్రజల్లో ఉద్వేగాన్ని రెచ్చగొట్టడానికే జగన్ తో కలిసి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని దుర్గా ప్రసాద్ ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో జిల్లాలల వారీగా వైషమ్యాలు రేకెత్తించాలనే కేసీఆర్ కొత్త జలవివాధాలకు తెరలేపుతున్నారని కాశీనాథ్ ధ్వజమెత్తారు!

ఇదే క్రమంలో మైకందుకున్న నన్నూరి నర్సిరెడ్డి… కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ సకాలంలో ఇవ్వలేదని విమర్శించారు. మద్యం వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉండగా… అక్షరాస్యతలో మాత్రం చివరి స్థానంలో ఉందని.. ఇక ఆసుపత్రుల్లో కూడా వైద్య సదుపాయాలు సరిగ్గ లేవని విమర్శించారు. ఇదే క్రమంలో తెలంగాణలో విద్య, వైద్య రంగం అనే అంశంపై చివరిగా స్పందించిన బాబు… గచ్చిబౌలి మైదానాన్ని ఆసుపత్రిగా మార్చటం అభినందనీయం అన్నారు!! ఆ విధంగా, ఆ రకంగా… మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత, ఇతర టీడీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచనలు సలహాలూ ఇస్తూ, అభినందనలు తెలియజేశారు!

Read more RELATED
Recommended to you

Latest news